Salaar : ప్రభాస్ ‘సలార్’ ప్రభంజనాన్ని ఆపడం.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వల్ల కాలేదు. వరుస రూ.1000కోట్ల మూవీలతో దూకుడు మీదున్న షారుఖ్ సినిమా ‘డంకీ’ సైతం సలార్ ధాటికి పల్టీలు కొట్టింది. బాలీవుడ్ థియేటర్ మాఫియా సలార్ ను అడ్డుకోవాలని చూసినా ‘డంకీ’కి ఆడియన్స్ లేకపోవడంతో సలార్ ను వేయక తప్పలేదు. ఇప్పటకీ సలార్ అక్కడ మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక సలార్ తెలుగు రాష్ట్రాల్లోనూ, ప్రశాంత్ నీల్ సొంత ఏరియా కర్నాటకలో మంచి వసూళ్లే రాబడుతోంది. ఇక కేరళలో ఇప్పటివరకు రూ.12 కోట్ల దాక రాబట్టింది. సలార్ లో కీలక పాత్ర పోషించిన పృథ్వీరాజ్ సుకుమారన్ సొంత రాష్ట్రం కేరళ. ఆయన అభిమాన గణం ఎక్కువే. అయినా కూడా అక్కడ ఓ సినిమా రూ.100కోట్లు రాబట్టింది.
ఆ సినిమే మోహన్ లాల్ నటించిన ‘నేరు’. ఈ సినిమాకు దర్శకుడు జీతూ జోసెఫ్. జీతూది, మోహన్ లాల్ ద్వయానిది మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్. గతంలో ఇద్దరూ కలిసి చేసిన దృశ్యం-1,2, 12 మాన్ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. వీరిద్దరి కాంబోలో ప్రస్తుతం ‘నేరు’ అనే మూవీ వచ్చింది. అది సలార్ కు పోటీగా. కోర్టు రూమ్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ వచ్చింది. ఇందులో ప్రియమణి కీలక పాత్ర పోషించారు. ఈ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. గత కొంతకాలంగా మోహన్ లాల్ మూవీస్ అన్ని విజయవంతంగా నడుస్తున్నాయి. అయితే ఈ మూవీపై సలార్ రిలీజ్ అయిన తొలి వారం దాక కాస్త ప్రభావం పడింది. కానీ రెండో వారం నుంచి పాజిటివ్ మౌత్ టాక్ తో ఆడియన్స్ విపరీతంగా పెరిగారు. సలార్ 12కోట్లకు పరిమితమైతే.. నేరు ఇప్పటికే 100కోట్లు రాబట్టింది. రాబోయే సెలవు దినాల్లో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
మలయాళీ సినిమాలు కేరళ తర్వాత ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ లో ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఆ తర్వాత యూఎస్. ఓవర్సీస్ లో ఈ సినిమా దాదాపు 2 మిలియన్ల డాలర్లను వసూలు చేసింది. కోర్టు రూమ్ డ్రామా అయిన ఈ మూవీకి శాంతి మాయాదేవి, జీతూ జోసెఫ్ కథను అందించారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు. ఓ నిస్సహాయురాలైన అంధురాలికి జరిగిన అన్యాయంపై పోరాడే ఓ లాయర్ కథ ఇది. ఎత్తులు పైఎత్తులతో ఆడియన్స్ కు ఎంతో థ్రిల్ ను పంచడమే కాదు.. న్యాయ వ్యవస్థను డబ్బు, అధికారం ఎలా ప్రభావితం చేస్తున్నాయో కళ్లకు కట్టినట్టు దర్శకుడు చూపాడు. అద్భుతమైన కథతో తెరకెక్కిన ‘నేరు’ మలయాళీ గడ్డపై ‘సలార్ ’ ప్రభంజనాన్ని దీటుగా ఎదుర్కొందనే చెప్పాలి.