Deputy CM Bhatti : ఆ నిధులు రుణమాఫీకే వినియోగించాలి: డిప్యూటీ సీఎం భట్టి
Deputy CM Bhatti : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకే వినియోగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రజాభవన్ లో బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీ దేవంలోనే చరిత్రాత్మక నిర్ణయమని చెప్పారు. రూ.2 లక్షల రుుణమాఫీ పథకం ద్వారా ఒకేసారి రూ.31 వేల కోట్లు ఏ రాష్ట్రంలోనూ మాఫీ చేయలేదన్నారు. ఈ నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర అప్పులకు జమ చేయవద్దని సూచించారు.
ఈరోజు (గురువారం) సాయంత్రం 4 గంటలకు 11 లక్షలకు పైగా రైతులకు రూ.6 వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెలలోనే రెండో దఫా రూ.లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతులకు, ఆ తర్వాత రూ.2 లక్షల వరకు రుణాలకు నిధులు విడుదల చేస్తామన్నారు. రూ.2 లక్షలకు పైబడి రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.2 లక్షలు కలిపి మొత్తంగా ఏ రైతూ రుణ బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.