Rebirth : మతి స్థిమితం లేని ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సంవత్సరం తర్వాత బెంగళూరులో ఓ వ్యక్తి మృతి చెందగా, ఆయన ఆనవాళ్లు ఈయనలాగే ఉండడంతో మృతుడు ఆయనే అనుకున్నారు. కుటుంబ సభ్యలు మృతదేహాన్ని ఇంటికి తెచ్చి దహన క్రియలు నిర్వహించారు. అనంతరం మరణ ధ్రువపత్రం కూడా తీసుకున్నారు. దీంతో ఆయన ఆధార్ కార్డు రద్దు చేయగా రేషన్ కార్డులో ఆయన పేరును తొలగించారు. ఆ వ్యక్తి తవణంపల్లె మండలం పైమాఘం గ్రామానికి చెందిన ఆంజనేయులు శెట్టి.
అయితే, నాలుగేళ్ల అనంతరం ఆంజనేయులు శెట్టి గ్రామానికి తిరిగి రావడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ రికార్డుల్లో తనకు పునర్జన్మ ప్రసాదించాలంటూ మండల కార్యాలయాల చుట్టూ తిరిగారు. అక్కడ ఎవరూ ఏమీ చెప్పలేక పోయారు. దీంతో సోమవారం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ కు తన కుటుంబ సభ్యలతో కలిసి వచ్చి కలెక్టర్ కు విన్నవించారు. దీనిపై అక్కడి తహసీల్దారును విచారించి నివేదించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు.