Pawan Kalyan : అన్నా డీఎంకే పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నా డీఎంకే పార్టీకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) ఈ పార్టీని స్థాపించి తమిళనాడులో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారన్నారు. పేదలు, అన్నార్తులకు సాయం చేశారని, వారికి హుందాగా జీవించే హక్కును కల్పించారని కొనియాడారు. ఆయన పాలనలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమానంగా చేపట్టారని, తమిళనాడును దేశంలో సుసంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు.
‘‘ప్రజల వర్తమాన అవసరాలను తీర్చడంతో పాటు దీర్ఘకాలిక భవిష్యత్తు, స్థిరాభివృద్ధి కోసం ఎంజీఆర్ గొప్ప పునాది వేశారు. ప్రజలు, పాలనపట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని చూసి నేను స్ఫూర్తి పొందా. ఎంజీఆర్ తర్వాత ఆయన ఆశయాలు, నాయకత్వాన్ని జయలలిత విజయవంతంగా కొనసాగించారు. ఎంజీఆర్ ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజల చేత ‘అమ్మ’గా గౌరవాన్ని అందుకున్నారు. పళనిస్వాయి నేతృత్వంలో అన్నాడీఎంకే, ఎంజీఆర్ విలువల్ని ముందుకు తీసుకెళ్లాలి. ఎన్నో సవాళ్లు ఎదురైనా ఆ పార్టీ తమిళనాడు ప్రజల గొంతుకగా ఉంది. ఇదంతా ఆ పార్టీ విలువల వల్లే సాధ్యమైంది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.