Hyderabad: తెలంగాణలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ కట్టడాలను అరికట్టేందుకు హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైడ్రా నగరంతో పాటు, శివారు ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలను చేపడుతోంది. అంతేకాకుండా అక్రమ నిర్మాణాలకు నోటీసులు కూడా జారీ చేస్తోంది.
తాజాగా, ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ కు చెందిన జయభేరి కన్ స్ట్రక్షన్స్ సంస్థకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. గచ్చిబౌలి పరిధిలోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నోటీసులపై మురళీమోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎలాంటి ఆక్రమణలకు, అవకతవకలకు పాల్పడలేదని మురళీమోహన్ చెప్పారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు వచ్చారని, బఫర్ జోన్ లో మూడు అడుగుల మేరకు రేకుల షెడ్డు ఉన్నట్లు అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారని తెలిపారు. దానిని కూల్చివేతకు హైడ్రా రావలసిన అవసరం లేదని, ఆ షెడ్డును రెండు రోజుల్లో తామే కూల్చేస్తామని చెప్పారు. కొద్ది రోజుల క్రితం మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రాను ప్రశంసించారు.