AP Nominations : ఆంధ్రప్రదేశ్ లో ఈ సారి పార్లమెంట్, శాసన సభ ఎన్నికలు ఒకేసారి వచ్చాయి. ఇందులో భాగంగా వైసీపీ, కూటమితో తలపడుతోంది. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కూటమి అభ్యర్థి చంద్రబాబు కలలు కొంటుంటే.. అధికారాన్ని కాపాడుకోవాలని జగన్ ఆరాటపడుతున్నాడు. ఇద్దరి మధ్యా పోరు రసవత్తరంగా జరుగుతోంది.
అభ్యర్థుల ఎంపిక, ప్రకటన, బుజ్జగింపులు, నామినేషన్ల దాఖలు తదితర ఘట్టాలు విజయవంతంగా ముగిశాయి. ఇక ముఖ్యమైన ఘట్టం ప్రచారం మాత్రమే ఉంది. ఇందుకు నేతలు పూర్తి అస్త్ర శస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో అసలే వేసవి ఎండలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలు రాజకీయ నాయకుల వేడి వేసి ప్రసంగాలతో మరింత హీటెక్కుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే నామినేషన్ల ఘట్టం ముగిసింది కాబట్టి ఎక్కడ ఎన్ని నామినేషన్లు వచ్చాయో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిందని, ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంటరీ సెగ్మెంట్లకు 686 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 503 నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు ఆమోదించగా, మిగిలినవి వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. అత్యధిక నామినేషన్లు ఉన్న నియోజకవర్గం గుంటూరులో 47 నామినేషన్లు నమోదు కాగా, అత్యల్పంగా శ్రీకాకుళంలో 16 నామినేషన్లు దాఖలయ్యాయి.
అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే 2705 నామినేషన్లను ఆర్వోలు ఆమోదించారు. తిరుపతిలో అత్యధికంగా 52 నామినేషన్లు దాఖలు కాగా, చిదంబరానికి 8 మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 చివరి తేదీ. ఆ తర్వాతే తుది జాబితాను ప్రచురిస్తారు. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనుంది.