Heavy Rains : ఏపీలో భారీ వర్షాలు.. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూంలు: మంత్రి అనిత
Heavy Rains : ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ.. అధికారులు ప్రతీ జిల్లాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. వర్షాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశానుసారం మంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. బ్యారేజీల వద్ద నీటిమట్టం స్థాయి పెరుగుతోంది. పలు చోట్ల రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా వరద ఉధృతి ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి వారు తీసుకుంటున్న చర్యలపై మంత్రి అనిత వివరాలు అడిగారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఇదెలా ఉండగా.. మంత్రి అనిత వేంకటేశ్వరుడి దర్శనం కోసం శుక్రవారం అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్లారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డు, రామకృష్ణా థియేటర్ రోడ్డు, వెలమ వీధి, పూర్ణా మార్కెట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. జ్ఞానాపురం పాతవంతెన వద్ద వరదనీరు నిలిచిపోయింది. విశాఖ ఆర్అండ్ బీ కార్యాలయం నుంచి బిర్లా వరకు సర్వీసు రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తోంది. కార్యాలయాలు, పరిశ్రమలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాళ్ల నీటిలో వాహనాలు నడుపుతూ అవస్థలు పడ్డారు. ఏకధాటిగా కురుస్తున్న నేపథ్యంలో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.