Golden Ganesh: దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఎక్కడ చూసినా వినాయకుడి మండపాలు దర్శనమిస్తున్నాయి. వివిధ రూపాల్లో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. అయితే, ఈసారి కూడా వినాయక వేడుకల్లో ముంబైలోని జీఎస్ బీ సేవా మండల్ మహాగణపతి విగ్రహం వార్తల్లో నిలిచింది. దేశంలోనే సంపన్న గణపతిగా పేరొందిన ఈ లంబోదరుడి ఉత్సవాల కోసం నిర్వాహకులు ఈ ఏడాది ఏకంగా రూ.400 కోట్లతో బీమా చేయించారు.
ముంబై శివారు ప్రాంతమైన మాతుంగాలో ఈ కాస్ట్ లీ గణేశుడిని ఏర్పాటు చేశారు. ఇలా గత ఏడు దశాబ్దాలుగా జీఎస్ బీ సేవా మండల్ వినాయక వేడుకలను ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఏకంగా 66 కేజీల బంగారం, 325 కేజీల వెండి ఆభరణాలతో అలంకరించారు. అందుకే ముందుజాగ్రత్తగా రూ.400.58 కోట్లతో బీమా చేయించినట్లు నిర్వాహకులు ఓ మీడియా సంస్థకు తెలిపారు.
మండపంలో భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా డిజిటల్ లైవ్ సేవలు, క్యూఆర్ కోడ్ వంటి వాటిని అందుబాటులో ఉంచారు.