JAISW News Telugu

Deputy CM Pavan: వరద బాధితులకు రూ.600 విరాళం.. స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Deputy CM Pavan: వరదలతో విలవిల్లాడిన ప్రజలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు తమకు చేతనైనంతగా విరాళాలు అందిస్తున్నారు. విరాళాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. బ్యాంకు అకౌంట్ వివరాలను సైతం పౌరులతో పంచుకుంది. ఈ క్రమంలోనే వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు రూ.600 విరాళం అందించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది. ఈ ట్వీట్ కు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సైతం స్పందించింది. అయితే పనిచేస్తే కానీ పూట గడవని స్థితిలో వరద బాధితులకు సాయంగా నిలవాలనే తపనతో ఆయన చేసిన సాయంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘‘ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 రూపాయలను విజయవాడ వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది. ఆ డబ్బులు కూడా పంపిస్తాను. పవన్ కల్యాణ్ గారు నాకు స్ఫూర్తి. కష్టాలన్నవి అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది’’ అంటూ గుడవర్తి సుబ్రమణ్యం అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సైతం స్పందించి రిప్లై ఇచ్చింది.

‘‘రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుంచి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ప్రేరణ. నిస్వార్థంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన 600 రూపాయలు చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పవన్ కల్యాణ్ తరపున డిప్యూటీ సీఎంవో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్లు వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలనే ఉద్దేశంతో చేసే ప్రతి సాయం ఎంతో విలువైనదంటూ సుబ్రమణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.

 

Exit mobile version