Telangana Anthem : రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ‘జయ జయహే తెలంగాణ’ గీతంలో స్వల్ప మార్పులు, చేర్పులు చేస్తున్నందున అందుకు సంబంధించి ప్రముఖ కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో చర్చించేందుకు సీఎం స్టూడియోకు వెళ్లారు. ఆ గీతంలో జిల్లాల ప్రస్తావనతో పాటు మరికొన్ని అంశాలు ఉండడంతో వాటి స్థానంలో ఏయే అంశాలు ఉండాలన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది.
సలహాదారుడు వేం నరేంద్ర రెడ్డితో కలిసి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆ పాటను ఒకటి, రెండు సార్లు విని, అందులోని అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుత రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండడంతో.. గతంలో పది జిల్లాలు అన్న పదాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో పద పద అన్న పదాన్ని చేర్చినట్లు సమాచారం.