Chandrababu Government : ఏపీలో కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం.. అంబరాన్నంటిన సంబురాలు
Chandrababu Government : తెలుగు తమ్ముళ్ల ఐదేండ్ల కల సాకారమైంది..దశాబ్దకాలంగా జనసైనికులు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరింది. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని అతిరథ మహరథులు అందరూ తరలిరాగా నభూతో నభవిష్యత్ అన్నట్టుగా జరిగింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకావడంతో ఎన్డీఏ కూటమి శ్రేణుల ఉత్సాహం ఆకాన్నంటింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఆయన తర్వాత గవర్నర్ 24 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా సభా ప్రాంగణమంతా జై చంద్రబాబు.. జైజై చంద్రబాబు.. జై చంద్రన్న.. జై టీడీపీ అనే నినాదాలతో మార్మోగిపోయాయి.
చంద్రబాబు తర్వాత వరుసగా పవన్ కల్యాణ్, నారా లోకేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, మహమ్మద్ ఫారుఖ్, గుమ్మడి సంధ్యారాణి, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, వంగలపూడి అనిత, పొంగూరి నారాయణ, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని నేరుగా చూడలేని వారి కోసం పలుచోట్ల లైవ్ టెలికాస్ట్ పెట్టడం విశేషం. గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ పై కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా జై అమరావతి..జై చంద్రబాబు.. జై టీడీపీ నినాదాలతో హెరెత్తించారు. అలాగే కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో కూడా కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేశారు.