Afghan VS Uganda : ఉగాండా, అఫ్గాన్ మధ్య జరిగిన టీ 20 వరల్డ్ కప్ అయిదో మ్యాచ్ లో ఉగాండాను 58 పరుగులకే ఔట్ చేసి అఫ్గాన్ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అప్గాన్ బ్యాటర్లు ఉగాండా బౌలర్లపై సిక్సులు, ఫోర్లతో రెచ్చిపోయారు. అప్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చరిత్ర సృష్టించారు.
గుర్బాజ్ నాలుగు సిక్సులు, నాలుగు ఫోర్లతో 76 పరుగులు చేయగా.. ఇబ్రహీం జద్రాన్ తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సు కొట్టగా.. 70 పరుగులు చేశారు. 14.3 ఓవర్లకే 154 పరుగులు చేసిన అఫ్గాన్ ను ఉగాండా బౌలర్లు చివరి అయిదు ఓవర్లు కట్టడి చేసి 186 పరుగులకే పరిమితం చేశారు. ఉగాండా బౌలర్లలో మసాబా రెండు వికెట్లు తీయగా.. కోస్కుయ్ కేవుట్ల 2 వికెట్లు తీశారు.
అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఉగాండా బ్యాటర్లను అప్గానిస్తాన్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించారు. అఫ్గాన్ బౌలర్ ఫజుల్ ఫరూకీ నాలుగు ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో అఫ్గాన్ తరఫున టీ 20 లో బెస్ట్ బౌలింగ్ ఫర్పామెన్స్ తో అదరగొట్టాడు. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ లు రెండేసి వికెట్లు తీసి ఉగాండాను కట్టడి చేశారు. 18 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఉగాండా అత్యంత చెత్త రికార్డు మూట గట్టుకునేలా కనిపించింది.
కానీ ఇద్దరు బ్యాటర్లు డబుల్ డిజిట్ స్కోరు చేయడంతో 46 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. అయితే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో చివరకు 58 పరుగులకే ఆలౌట్ అయింది. పెద్ద టోర్నమెంట్ లో అవకాశం రావడమే గొప్ప. కానీ దీన్ని ఉగాండా సరైన విధానంలో ఉపయోగించుకోలేకపోతుంది. రాబోయే మ్యాచుల్లో పెద్ద జట్లతో ఆడాల్సి ఉండగా.. ఈ ప్రదర్శనతో ఉగాండా టీం మరింత దిగజారిపోయినట్లే కనిపిస్తోంది. ఉగాండా స్థాయికి మించి ప్రదర్శన చేస్తేనే పరువు పొగొట్టుకోకుండా ఉంటుంది.