Needles : ఒడిశాలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి తలలోకి మాంత్రికుడు 70 సూదులను విడతలవారీగా గుచ్చాడు. సిటీ స్కాన్ చేయించిన డాక్టర్లు అవాక్కయ్యారు. ఒడిశాలోని బాలింగీర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి తలలోకి ఓ మాంత్రికుడు ఏకంగా 70 సూదులను గుచ్చాడు. మూఢనమ్మకంతో బాధితులు కూడా అతణ్ణి నమ్మారు. ఫలితంగా ఆమె ఆస్పత్రి పాలైంది. శుక్రవారం డాక్టర్లు ఆమెకు సీటీ స్కానింగ్ చేసి తలలో ఉన్న సూదులను గుర్తించి విస్మయానికి గురయ్యారు. వెంటనే ఆపరేషన్ చేసి దాదాపు గంటన్నర పాటు శ్రమించి యువతి తలలోని 70 సూదులను బయటికి తీశారు. పుర్రె ఎముకపై ఉన్న పిన్నులు లోపలికి వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు మాంత్రికుడిని అరెస్టు చేశారు.
బాలింగీర్ జిల్లాలో సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇచ్ గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహరా అనే 19 ఏళ్ల యువతి మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె తండ్రి బిష్ణు బెహరా డాక్టర్లకు చూపించకుండా సంతోష్ తేజ్ రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించారు. తాంత్రిక వైద్యం పేరుతో ఆ మాంత్రికుడు పలు దఫాలుగా రేష్మా తలలోకి 70 సూదులను గుచ్చాడు. ఇటీవల యువతి తీవ్ర తలనొప్పితో బాధపడడంతో కుటుంబసభ్యులు వింసార్ ఆస్పత్రికి తరలించగా మాంత్రికుడి గుట్టు బయటపడింది.