Konda Surekha-Samantha issue : హీరో నాగచైతన్య, సమంత విడాకులకు మాజీ మంత్రి కేటీఆరే వందకు వంద శాతం కారణమంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రస్థాయిలో ఆమె చేసిన మరిన్ని ఆరోపణలు దుమారం రేపాయి. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ.. పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌తో పడలేక ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కొంత మంది హీరోయిన్ల ఫోన్లనూ ట్యాప్ చేయించారని.. వారి మాటలను రికార్డ్ చేసి బెదిరించారన్నారు. తాను డ్రగ్స్ వాడడమే కాక వారికి కూడా అలవాటు చేశారని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో మంది నటీమణుల జీవితాలతో ఆడుకుని, వారిని డ్రగ్స్ కేసులో ఇరికించిన కేటీఆర్.. తాను మాత్రం తప్పుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలను నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత ఖండించారు. అమల తీవ్రమైన పరుష పదజాలంతో ట్విటర్‌లో మంత్రి సురేఖ పై విరుచుకుపడ్డారు.
ఈ ఇష్యూను బట్టి కొన్ని విషయాలను అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో సీనియర్లు ఎందుకు ఆచితూచి స్పందిస్తారో ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. అప్పటివరకు అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఒక్కమాట ఎంత డ్యామేజ్ చేస్తుందో కొండా సురేఖ ఉదంతం కళ్లకు కట్టినట్లుగా కనిపించింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన వికృత పోస్టింగ్ లతో బాధితురాలిగా మారిన మంత్రి సురేఖ పై మొదట్లో పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తమైంది. వ్యక్తిత్వ హననం చేశారని ఆమెపై సానుభూతి వ్యక్తం కాగా.. కేటీఆర్ పై రాజకీయాలకతీతంగా కన్నెర్ర జేశారు. ఆ మద్దతుతో కేటీఆర్ ను మరింత ఇరుకున పెట్టే అవకాశం ఉన్నా కాళ్లదన్నకున్నారు కొండా సురేఖ. విషయాన్ని పక్కకు తప్పించి.. సంబంధం లేని విషయాలను ప్రస్తావించి బాధితురాలు కాస్త భ్రష్టురాలుగా మిగిలిపోవాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకున్నారు. ఇంటా, బయటా అంతటా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అసలు ఈ ఎపిసోడ్ లో కేటీఆర్ ఇరుకునపడే ప్రమాదం ఉన్నా దానిని తప్పించింది స్వయానా కొండా సురేఖ వ్యాఖ్యలే.
కేటీఆర్ ను విమర్శించే క్రమంలో భావోద్వేగంతోనే ఈ వ్యాఖ్యలు చేశాయని, తర్వాత తన వ్యాఖ్యలను కొండా సురేఖ ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. కానీ ప్రత్యర్ధిని ఢీకొట్టాలంటే భావోద్వేగంతో అసలు పని కాదు. భావోద్వేగం సానుభూతిని తెచ్చిపెట్టేలా ఉండాలి. లేకపోతే తలెత్తుకోలేని విధంగా బద్నాం అయిపోతారు..ఇప్పుడు కొండా సురేఖ విషయంలో ఇదే జరిగింది. అందుకే రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడటం మంచిది.. లేదంటే అప్పటివరకు సంపాదించుకున్నా కొన్నేళ్ల ప్రతిష్టను ఒక్కనోటి మాటతో తుడిచి పెట్టుకుని పోతుందని కొండా సురేఖ ఎపిసోడ్ స్పష్టం చేసినట్లే.