Sitting MLA : మహారాష్ట్ర ఎన్నికల వేళ ఓ అనూహ్య విషయం వెలుగులోకి వచ్చింది. టికెట్ దక్కలేదన్న ఆవేదనలో ఓ ఎమ్మెల్యే జాడ లేకుండాపోయారు. ఫోన్ స్విచ్ఛాఫ్ అని వస్తుండడంతో అతని కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగకు సీఎం ఏక్ నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీ ఈసారి టికెట్ కేటాయించలేదు.
ఆయనకు బదులు పాల్ఘర్ స్థానం నుంచి మాజీ ఎంపీ రాజేంద్ర గోవిట్ ను బరిలోకి దింపింది. దాంతో శ్రీనివాస్ తీవ్ర వేదనకు గురయ్యారని సన్నిహితులు తెలిపారు. 2022లో ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని వీడి, చీలికవర్గమైన శిందే వర్గంతో వెళ్లినందుకు తగిన శాస్తి జరిగిందని కన్నీటి పర్యంతమైనట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబరు 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కింపు చేపడతారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ రోజే ఆఖరు తేది.