JAISW News Telugu

AP Elections : ఆంధ్రా భవిష్యత్ ను తేల్చే ఎన్నికలు.. ప్రజల మొగ్గు ఎటువైపు?

AP Elections

AP Elections

AP Elections : మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. రాష్ట్రంలో  ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉండబోతున్నాయి. దీంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. అభ్యర్థుల ప్రకటనలు, మ్యానిఫెస్టోల తయారీ, బహిరంగ సభలతో బిజీబిజీ అయిపోయాయి. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి మధ్యనే పోటీ ఉండబోతోంది.

ఏపీ పునర్విభజన తర్వాత రాష్ట్రానికి ఓ రాజధాని అంటూ లేకపోయింది. ఎంతో మంది బడా పారిశ్రామిక వేత్తలు, నిపుణులైన ఉద్యోగులు,  నైపుణ్యం ఉన్న విద్యార్థులు ఉన్నా.. వారికి సరైన అవకాశాలు లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అమరావతిని రాజధానిగా చేసింది. ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు మిగతా రాష్ట్రాన్ని పెద్దగా పట్టించుకోకుండా రాజకీయాలను అమరావతి చుట్టే తిప్పింది. దాని నిర్మాణం ఓ కొలిక్కి రాకుండానే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

ఆ పార్టీ అధినేత అమరావతిని కాదని మూడు రాజధానుల విషయాన్ని పైకి తెరపైకి తెచ్చారు. ఈ వ్యవహారంతో ఐదేండ్లు గడిచింది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లైనా ఏపీకి ఇప్పటికీ ఓ రాజధాని లేకపోవడం ఇక్కడి ప్రజలను కలిచివేస్తోంది. రాజకీయ పార్టీల పోరులో రాజధాని విషయం నలుగుతూనే ఉంది. ఇక రాబోయే ఎన్నికల్లో ప్రజల ముందు రెండు ఆప్షన్లు కనపడుతున్నాయి.

టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని, వైసీపీ అధికారంలోకి వస్తే విశాఖ పాలన రాజధాని కావడం మాత్రం పక్కా. రాజధానుల విషయంలో ఈ రెండూ పార్టీలు తమవైన వ్యూహాలతో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీల ప్రధాన హామీ కూడా రాజధానే. వైసీపీ అధికారంలోకి వస్తే పలు సంక్షేమ పథకాల అమలు, విశాఖ పాలన రాజధానిగా చేస్తామని చెపుతున్నారు. అమరావతిని రాజధాని చేస్తే లక్షల కోట్లు అవసరం పడుతాయని, అయినా  ఆ నగరం హైదరాబాద్, బెంగళూరు స్థాయికి చేరాలంటే మరో 20 ఏండ్లు పడుతుందని జగన్ చెబుతున్నారు. అందుకే అన్ని వసతులు ఉన్నా విశాఖను రాజధానిగా చేస్తే పెద్దగా ఖర్చు లేకుండానే కొద్ది రోజుల్లోనే మంచి రాజధానిని తయారు చేసుకోవచ్చని అంటున్నారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే అమరావతిని అభివృద్ధి, సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు. అమరావతిని సింగపూర్ రేంజ్ లో డెవలప్ చేస్తామని అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే ఎన్నికల్లో రాజధానే డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నట్లు అర్థమవుతుంది. మరి ప్రజలు ఏ వైపు ఉంటారు? అమరావతి వైపా? విశాఖ వైపా? అనేది వారి చేతిలోనే ఉంది. వారి భవిష్యత్ ను వారే రాసుకోబోతున్నారు. గత ఎన్నికలకు మించి ఈసారి ఎన్నికలు ఏపీ భవిష్యత్ ను తీర్చిదిద్దేవి కావడం మాత్రం ఖాయం.

Exit mobile version