Police Firing : రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ రోజు (శుక్రవారం) ఉదయం పోలీసులపై కత్తులతో దాడిచేసి పారిపోతున్న దొంగలపై పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై దాడికి దిగిన దోపిడీ దొంగలు పార్థ గ్యాంగ్ గా గుర్తించారు. పోలీసుల నుంచి దోపిడీ దొంగలు తప్పించుకునేందుకు ప్రయత్నించగా పార్థగ్యాంగ్ ను పట్టుకునేందుకు నల్గొండ పోలీసులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు చేయడంలో పార్థగ్యాంగ్ ఆరితేరిందని పోలీసులు తెలిపారు.
దోపిడీ దొంగలు వస్తున్నారనే సమాచారంతో నల్గొండ పోలీసులు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మాటు వేశారు. వ్యాన్ లో వస్తున్న దోపిడీ దింగలను అడ్డగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసులను గమనించిన దొంగలు వ్యాన్ ను ఆపకుండా వేగంగా అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. అయినప్పటికీ దొంగలు ఉన్న వ్యాన్ ను ఆపేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పార్థ గ్యాంగ్ కత్తులతో దాడికి దిగింది. దీంతో దోపిడీ దొంగలపై కాల్పులు జరిపి నలుగురిని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.