JAISW News Telugu

Sharmila Audio Leak : ఆడియోతో అడ్డంగా దొరికిన షర్మిల..అందులో ఏముందంటే..!

Sharmila Audio Leak

Sharmila Audio Leak

Sharmila Audio Leak : ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల పర్వం ముగిసినా కొందరు రెబల్స్ పోటీలో ఉన్నారు. కనీసం వీరిని ప్రచారం చేయకుండానైనా ఉంచాలని అధినేతలు బుజ్జగిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ స్టేట్ చీఫ్ వైఎస్ షర్మిల ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంతల సుబ్బారావుకు ఫోన్ చేసి షర్మిల మాట్లాడారు. దీనికి సంబంధించిన ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వంతల సుబ్బారావు తొలి నుంచి కూడా కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఎన్నికల ముందు ఆయనకే టికెట్ అంటూ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ప్రకటించారు.

అయితే పాడేరు సిట్టింగ్ ఎమ్మెల్యే బుల్లిబాబుకు వైసీపీలో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో వంతల సుబ్బారావును పక్కనపెట్టి బుల్లిబాబుకు టికెట్ కేటాయించారు కాంగ్రెస్ పెద్దలు. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన వంతల సుబ్బారావు పాడేరు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. సుబ్బారావు అక్కడి నుంచి రెబల్ గా పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థికి ఫలితం అనుకూలంగా వచ్చే అవకాశం ఉండడంతో షర్మిల రంగంలోకి దిగారు. వంతల సుబ్బారావుతో ఆమె రాయబారం నడిపారు.

సుబ్బారావును బుజ్జగించే ప్రయత్నం చేశారు. మీరు సొంత అన్న మాదిరి అని, అర్థం చేసుకోవాలని, తర్వాతిసారి చూద్దాం అంటూ బతిమాలాడారామె. దీనిపై సుబ్బారావు మాట్లాడుతూ.. ఏనాడూ జెండా మోయనోడికి టికెట్ ఇవ్వడం తనను బాధించిందని, పైగా తనతో మాట కూడా చెప్పకుండా వేలమంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ప్రకటించడం తనను నిరాశ పరిచిందని షర్మిలతో వాపోయారు.

కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు వైసీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వంతల సుబ్బారావుకు స్పష్టం చేశారు. అలాంటప్పుడు తొలుత నన్ను ఎందుకు అభ్యర్థిగా ప్రకటించారని… నా రాజకీయ జీవితం నాశనమైందని షర్మిలకు వంతల సుబ్బారావు తెలిపారు. ఎంత నచ్చజెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే కాంగ్రెస్ గురించి మరిచిపోవాలంటూ షర్మిల హుకుం జారీ చేశారు. మంచిదంటూ సుబ్బారావు సైతం కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ తెగ వైరల్ అవుతోంది.

Exit mobile version