Nimmagadda Ramesh: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల గల్లంతుపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వినిపిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన ఓట్ల గల్లంతు సంఘటనల నేపథ్యంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటర్లకు కీలక సూచనలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2,3 తేదీల్లో దేశ వ్యాప్తంగా తలపెట్టిన `ఓటర్ల జాబితా ఇంటింటి పరిశీలన`కార్యక్రమాన్ని ప్రజలు తప్పని సరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఓటర్ల పరిశీలన బూతు లెవెల్ అధికారులు వచ్చినప్పుడు ఓటర్లు తమ ఇంటి వద్దే ఉండాలని, బీఎల్వోలు రాని పక్షంలో ఆ విషయాన్ని ఫిర్యాదు చేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులు డిసెంబర్ 2,3 తేదీల్లో ఇంటింటికీ వచ్చి ఓటర్ల జాబితా పరిశీలనను చేపడతారని, ఏవైనా మార్పులు చేర్పులు, తొలగింపులు, సక్రమంగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అధికారులు ఇంటికి వచ్చినప్పుడు నిబంధనల ప్రకారం నివాస దృవపత్రం సహా అన్ని రకాల పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జాబితాలో తమ పేర్లు కానీ, కుటుంబ సభ్యుల పేర్లు కానీ లేకుంటే ఫారం-6ను సమర్పించాలన్నారు. అంతే కాకుండా తమ ఇంటి నంబరులో కుటుంబానికి సంబంధంలేని వారి పేర్లు ఉంటే వాటి తొలగింపు కోసం ఫారం-7ను సమర్పించాలని, కుటుంబ సభ్యుల పేర్లు వేరు వేరు బూతులలో నమోదై ఉంటే వారంతా ఒకే బూతులో మార్చేందుకు ఫారం-8ను సమర్పించాలని తెలిపారు. సమర్పించిన ఫారంలకు తగిన రశీదులు కూడా పొందాలని, తద్వారా సక్రమమైన ఓటర్ల జాబితా తయారీలో భాగస్వాములు కావాలన్నారు.