Prashanth Kishore: కొత్త రాజకీయ పార్టీ పేరు, నాయకత్వం వివరాలను అక్టోబర్ 2న ప్రకటిస్తామని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. అయితే, పార్టీ నాయకత్వం మాత్రం తన చేతుల్లో ఉండదన్నారు. రెండేళ్ల క్రితం తాను చేపట్టిన జన్ సురాజ్ యాత్రనే రాజకీయ పార్టీగా మలచనున్నట్లు ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే బిహార్ శాసనసభ ఎన్నికల్లోనే పార్టీ తరపున పోటీ చేస్తామని చెప్పారు. అక్టోబర్ 2, 2022న జన్ సురాజ్ పేరుతో ప్రారంభించిన యాత్ర రెండేళ్లు పూర్తికానున్న సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కొత్త పార్టీ నాయకత్వ వివరాలను అక్టోబర్ 2న వెల్లడిస్తానని తెలిపారు.
మూడు ప్రధాన ఉద్దేశాలతోనే జన్ సురాజ్ యాత్ర చేపట్టినట్లు ప్రశాంతి కిశోర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు వారి చిన్నారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, తప్పుదోవ పట్టించే నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఓట్లు వేయకుండా అవగాహన కల్పించడంతో పాటు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో పర్యటించాలని ఈ యాత్ర చేపట్టానన్నారు. ఇప్నటి వరకు 60 శాతం యాత్ర పూర్తయిందని, తదుపరి కొనసాగుతుందన్నారు. అయితే, రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఈ యాత్ర కొనసాగుతుందన్న ఆయన, పార్టీకి నాయకత్వ బాధ్యతలు మాత్రం తాను వహించడం లేదన్నారు.