YCP Politics : ‘వసంత’ ఏమోషనల్.. వైసీపీ నేతల ఆవేదన వెనుక అర్థమేంటి?
YCP Politics : వైసీపీ ఎమ్మెల్యేలు బరెస్ట్ అవుతున్నారు. టికెట్లు దక్కవని కొందరు.. దక్కినా వేరే నియోజకవర్గానికి మార్చారని.. అక్కడ గెలవమని మరికొందరు మథనపడుతున్నారు. అందుకే ఆవేదనభరిత ప్రసంగాలు చేస్తున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వైసీపీలో పరిణామాలపై కలత చెంది తన నియోజకవర్గానికి చాలా చేశానని.. ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండని వేడుకున్నారు. ఇలా అధికార అంతమున వైసీపీ నేతలు ఏమోషనల్ కు గురవుతున్నారు. మరోసారి గెలవమని.. గెలిచే సీట్లు దక్కవన్న భయం వారిని వెంటాడుతోంది.
తను శాసనసభ్యునిగా గెలిపించిన మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం సాధ్యమైనంత వరకు శక్తివంచన లేకుండా కృషి చేశానని, అర్హతలు ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలను ఖచ్చితంగా అమలు చేశామని, ఉద్దేశపూర్వకంగా ఏ ఒక్కరికి సంక్షేమ పథకాల విషయంలో ఇవ్వడానికి వీల్లేదని అడ్డుపడలేదని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
జి.కొండూరులో పెంచిన పింఛన్లు పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క తమ్ముడు మీద కానీ, ఏ ఒక్క కుటుంబం మీద కానీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. చేస్తే మంచి చేద్దామని, ఏ ఒక్కరికీ చెడు చేయవద్దన్నారు. ఇదే నినాదంతో నాలుగున్నర ఏళ్లుగా పని చేశానన్నారు. కొన్ని జరగని పనులు ఏమైనా ఉంటే, అది తమ వల్ల, మా ప్రజాప్రతినిధుల వల్ల జరగలేదని అనుకోవడం పొరబాటు అన్నారు. వ్యవస్థాపరమైన లోపాలు, సాంకేతిక కారణాల వల్ల ఏమైనా కొన్ని పనులు జరగలేదు తప్పితే, నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరి పని ఉద్దేశ్య పూర్వకంగా ఆపలేదన్నారు. కోవిడ్ సంక్షోభంలో కూడా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
మైలవరం నియోజకవర్గం అభివృద్ధి పనుల విషయంలో జిల్లాలోని ప్రథమ స్థానంలో ఉందన్నారు. ఎంత అభివృద్ధి చేసినా ఏదో ఒక పని మిగిలిపోతూనే ఉంటుందన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, తాము చేసిన అభివృద్ధితో ఇప్పటికిప్పుడు మైలవరం నియోజకవర్గం స్విట్జర్లాండ్, అమెరికా, లండన్ వంటి దేశాల సరసన చేరిందని తను చెప్పడం లేదన్నారు. అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి, కార్యదీక్ష, పట్టుదల మనసులో ఉండాలన్నారు. తను మాత్రం ఎక్కడ అవకాశం కుదిరితే అక్కడ ప్రతి ఒక్క రూపాయి తీసుకువచ్చి మైలవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం శ్రమించినట్లు వెల్లడించారు.
ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల వద్ద కూడా నిధులు తెచ్చా.
మన జగనన్న ప్రభుత్వంలోని మంత్రుల వద్ద, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎంపీలు సుజనాచౌదరి, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని శ్రీనివాస్ (నాని)ల దగ్గర నుంచి కూడా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి పనులు పూర్తి చేశామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు ఒక్క రూపాయి ఇస్తానన్నా సరే వాళ్ళ వద్దకు వెళ్లి చేతులు ఎత్తి నమస్కరించి నిధులు తెచ్చినట్లు స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల విషయంలో తనవరకు మానసికంగా పూర్తిగా సంతృప్తి లేకపోయినా, తన పరిధి మేరకు తనకు ఉన్న నిధుల లభ్యతను బట్టి నియోజకవర్గంలో విస్తృతంగా పనులు చేసినట్లు పేర్కొన్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ పట్టణ గ్రామీణ, ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హళ్లు, సొసైటీ భవనాలు, గోదాములు, నాడు-నేడు కింద ఆసుపత్రులు, పాఠశాలల భవనాలు, సిమెంట్ రహదారులు, డ్రైనేజీలు, బీటీ రోడ్లు, పేదలకు ఇళ్లస్థలాలు, పక్కాగృహాలు, తదితర అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వంలో వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు తమ బాధ్యతలను తాము ఎటువంటి కుట్రలు, కుతంత్రాలు లేకుండా సక్రమంగా నిర్వర్తించామని స్పష్టం చేశారు.