Lok Sabha Elections : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ఆ పార్టీదే హవా.. తాజా సర్వేలో వెల్లడి
Lok Sabha Elections : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఆ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు రానున్నాయని పీపుల్స్ పల్స్- సౌత్ ఫస్ట్ ట్రాకర్ పోల్ అనే సర్వే సంస్థ తేల్చింది. ఈ సర్వేను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించింది. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారనే అభిప్రాయాలను సేకరించింది.
మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 10 సీట్లలో గెలుస్తుందని, బీఆర్ఎస్ 3-5 సీట్లు, బీజేపీ 2-4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ సీటును ఎలాగూ ఎంఐఎం గెలుచుకుంటుంది. అధికార పార్టీ అనే ట్యాగ్ లైన్ కాంగ్రెస్ కు బాగా కలిసివస్తుందని చెప్పింది. ఆరు గ్యారెంటీలు ఆ పార్టీకి విజయావకాశాలను పెంచుతున్నాయని తెలిపింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు వంటి పథకాలు అమలు చేస్తున్నారు. మరో వారంలో రోజుల్లో రూ.500లకే గ్యాస్ సిలిండర్, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం అమల్లోకి తేనుంది. వీటి ద్వారా లబ్ధి కలుగబోతోందని చెప్పింది.
ఇక నరేంద్ర మోదీ పరిపాలన అనే ట్యాగ్ లైన్ బీజీపీకి ప్రయోజనం చేకూరుస్తుందట. బీఆర్ఎస్ కు ఏ ట్యాగ్ లైన్ లేదు. దీంతో చాలా తక్కువ సీట్లకే పరిమితం కాబోతుందని చెప్పింది. ఈ సర్వేను ఫిబ్రవరి 11-17వరకు చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 40 శాతం ఓట్లు, బీఆర్ఎస్ కు 31 శాతం, బీజేపీకి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 6 శాతం ఓట్లను కోల్పోనుంది. ఇక ముస్లింల ఓటు బ్యాంకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు మళ్లనుందని తేల్చింది. ప్రధాన మంత్రిగా మోడీయే ఉండాలని 34శాతం జనాలు అభిప్రాయపడ్డారు. రాహుల్ కు మద్దతుగా 23 శాతం, ప్రియాంక గాంధీకి అనుకూలంగా 11 శాతం, మమతా బెనర్జీకి మద్దతుగా 10 శాతం మంది మొగ్గుచూపడం విశేషం.