JAISW News Telugu

KCR’s Sketch : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ స్కెచ్..బండి సంజయ్ వ్యాఖ్యల్లో అంతరార్థమిదేనా..?

KCR's Sketch

KCR’s Sketch Comments Bandi Sanjay

KCR’s Sketch : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలన్నర దాటింది. ఇప్పటి దాక అంతా ప్రశాంతంగా సాగిపోతునట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ మంత్రులు ఎవరి పని వారు చేసుకుంటూ ఏ అలజడి, కొట్లాటలు లేకుండా పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇక ప్రతిపక్షపార్టీలు బీఆర్ఎస్, బీజేపీ కూడా ప్రభుత్వంపై పెద్దగా విమర్శలకు దిగడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం టైమ్ ఇద్దామని వారు భావించారు.

ఇక ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు దాటడం.. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు రాబోతుండడంతో ప్రతిపక్షాలు తమ అస్త్రాలను బయటకు తీస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. బీజేపీ కూడా అదే పనిలో ఉంది.

తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్కెచ్ వేస్తున్నారని, కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులు చాలా మందే ఉన్నారని, లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. అలాగే రాజకీయాల్లో కేసీఆర్ అడ్రస్సు లేకుండా చేయాలని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఈజీగా చేసినవు కావు.. వాటిని వ్యూహాత్మకంగా చేసినట్టే కనిపిస్తోంది.

రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ప్రధాన పోటీదారు కాంగ్రెస్. ఆ పార్టీని ఎన్నికల తర్వాత కేసీఆర్ కూల్చబోతున్నారని ఆ పార్టీలో ప్రకంపనలు రేపి అస్థిరపరచడం.. తద్వారా కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లను తమ వైపునకు మళ్లించడం బండి వ్యాఖ్యల టార్గెట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన సాఫీగానే సాగిపోతోంది. ఎన్నికల వరకు ఇలాగే ఉంటే..ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ప్రచార అస్త్రాలు దొరకవు. ఏదో రకంగా కాంగ్రెస్ ను ఆత్మరక్షణలో పడవేయడం, అస్థిరపరచడం.. తద్వారా తాము లాభపడడం అనేవి ఆయన వ్యాఖ్యల లక్ష్యాలు.

ఇక కేసీఆర్ ను రాజకీయంగా అడ్రస్సు లేకుండా చేయాలనే వ్యాఖ్యల్లో.. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు అని, రాబోయే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేయడం లేదని, ఆ పార్టీతో తమకు ఎలాంటి ఒప్పందాలు లేవని చెప్పడం ద్వారా రెండు పార్టీలు ప్రత్యర్థులేనని ప్రజల్లో నమ్మకం కలిగించడం. వాస్తవానికి గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అనే విమర్శలతో రెండు పార్టీలకు నష్టం జరిగింది. ముఖ్యంగా బీజేపీకి భారీ డ్యామేజీ జరిగింది.

ఇలా రాబోయే ఎన్నికల్లో గత అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకునేందుకు బండి సంజయ్ ముందస్తుగానే ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. తన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ తమ ప్రత్యర్థులే అని చెప్పడం ద్వారా లోక్ సభ ఎంపీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమే అని చెప్పవచ్చు.

Exit mobile version