CM Revanth Silence : సీఎం రేవంత్ మౌనవ్రతం వెనుక ఇంత కథుందా..?

CM Revanth Silence

CM Revanth Silence

CM Revanth Silence : అవును.. ఎన్నికలకు  ముందు ఓ రేంజ్‌లో ఎగిరెగిరిపడిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకో సైలెంట్ అయ్యారు. అధికారంలోకి రాగానే అది చేస్తాం.. ఇది చేస్తాం.. చించేస్తాం.. పొడుస్తామంటూ తెగ హడావుడి చేసిన రేవంత్ చలీ చప్పుడు లేకుండా ఎంతసేపూ రివ్యూ మీటింగులు, ఢిల్లీకి వెళ్లుడు తప్పితే చేసిందేమీ లేదనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అసలు ఆయన ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు..? పులిలా ఎగిరెగిరిపడిన రేవంత్‌లో సడన్‌గా ఇంత మార్పేంటి..? అసలు ఇది మార్పేనా లేకుంటే వ్యూహమా..? అనేది అర్థం కాక సొంత పార్టీ నేతలు, క్యాడరే తలలు పట్టుకుంటోంది.

ఇలా ఉండి.. ఇప్పుడిలా..!

హేయ్ బిడ్డా కేసీఆర్.. పండబెట్టి తొక్కుతా.. కల్వకుంట్ల ఫ్యామిలీ కథలు ఇక నడవయ్.. ఒక్కొక్కరి బాగోతాలు తీస్తా.. ఏ ఒక్కర్నీ వదిలిపెట్టను.. అవినీతి చిట్టాను విప్పుతా.. సెంట్రల్ జైలులోనే కేసీఆర్‌కు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా.. ఇవీ రేవంత్ రెడ్డి పదే పదే ఎన్నికల ప్రచారం చెప్పిన మాటలు. సీన్ కట్ చేస్తే అసెంబ్లీ సమావేశాలు జరిగిన కొద్దిరోజులు హడావుడి చేసిన సీఎం.. ఇప్పుడు మిన్నకుండిపోయారు. అయితే.. ఇదంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసమేనని రేవంత్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు.. ఎన్నికల తర్వాత రవ్వంత ఉన్న రేవంత్ విశ్వరూపం ఏంటో చూస్తారంటూ ఆయన వీరాభిమానులు కొందరు సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. ఇదంతా కాదు అసలు కథ వేరే ఉందట.

ఇదీ అసలు కథ..!

రేవంత్ మౌనానికి అసలు కారణం పైవన్నీ కావన్నది కాంగ్రెస్ పెద్దలు చెబుతున్న మాట. వాస్తవానికి ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఖజానా మాత్రం ఖాళీగా ఉండటంతో కడుపు మండిపోయిందట. అందుకే రాష్ట్ర ఖజానాను కల్వకుంట్ల ఫ్యామిలీ కాజేసిందని ఒకరిపై ఒకరు పోటా పోటీగా శ్వేత, స్వేద పత్రాలు రిలీజ్ చేసుకున్నారు. దీంతో ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి కూడా కనీస ఖజానా లేకపోవడంతో మొదట ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత మిగతా సంగతని.. రేవంత్ ఫిక్స్ అయ్యారట. అంటే ఖజానాలో కాసుల్లేకపోవడమే సీఎం మౌనానికి కారణమన్న మాట.

ఏం చేయబోతున్నారు..?

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని.. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే విజయోత్సాహం ఉండాలంటే మొదట ప్రజల్లో నమ్మకం నెలకొల్పాన్నది రేవంత్ టార్గెట్. అందుకే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి లేకపోయినప్పటికీ.. బీజేపీ ఉన్నా ఇప్పటికే ఒకట్రెండు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలవడం.. కొత్త ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఙప్తి చేయడం జరిగింది. మోదీ కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడంతో ఇక రేవంత్ స్పీడ్ బ్రేకర్ ఉన్నా సరే తగ్గకుండానే ముందుకెళ్తున్నారట. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పంపకాలు, అప్పులు సైతం తీసుకునేందుకు రేవంత్ రంగం సిద్ధం చేసుకున్నారట. అధికారంలో చేపట్టిన నెలరోజులకే 1400 కోట్ల రూపాయిలు రేవంత్ అప్పు తెచ్చారు. అంతేకాదు రాబోయే మూడు నెలల్లో మరో 13 వేల కోట్ల రూపాయిలు రుణం తీసుకునేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరిలో 4 వేల కోట్లు, ఫిబ్రవరిలో 3 వేల కోట్లు, మార్చిలో 6 వేల కోట్లు రూపాయిలను అప్పుగా కేంద్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురానుంది. అంటే.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రేవంత్ సర్కార్ అప్పులు రూ.14,400 కోట్లకు చేరుకోనున్నాయ్ అన్న మాట.

అయితే ఎన్ని కోట్లు అప్పుచేసినప్పటికీ రేవంత్‌కు మాత్రం ప్రజలకు చెప్పుకునేందుకు మంచి ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీ ఖజానా ఖాళీ చేసింది.. ప్రజల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం అప్పులు చేయక తప్పదనే మాటలతో విమర్శకులకు, ప్రతిపక్షాలను డిఫెండ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. పైగా గడిచిన తొమ్మిదన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ 6 లక్షల కోట్లు అప్పు చేసిందనే మాట పదే పదే చెబుతూ కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇలా ఇవన్నీ కాంగ్రెస్‌కు ప్లస్‌గా అవుతాయే తప్ప ఎలాంటి మైనస్‌లు కావన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇప్పుడు సీన్ అర్థమైంది కదా రేవంత్ మౌనానికి కారణమేంటో..!

TAGS