Pawan Kalyan : తెలుగుదేశం పార్టీ-జనసేన కూటమి అభ్యర్థుల జాబితాను (ఫిబ్రవరి 24)న ఇరు పార్టీల అధ్యక్షులు రిలీజ్ చేశారు. టికెట్లు దక్కని రెండు పార్టీల నేతల్లో అసమ్మతి వ్యక్తమైంది. టీడీపీ గెలిచే స్థానాలను వదులుకుందని ఆ పార్టీ నాయకులు చెప్తుంటే.. జనసేనకు మరీ 24 సీట్లు కేటాయించడం దారుణం అంటూ జనసైనికులు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన కేడర్ ను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘వచ్చే ఎన్నికల్లో జనసేనకు 60 నుంచి 70 నియోజకవర్గాలు కేటాయించాలని పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు, వెల్ వెషర్స్ సూచనలు చేశారు. గత ఎన్నికల్లో 10 సీట్లు గెలిచి ఉంటే ఇప్పుడు 50 నుంచి 60 సీట్లు అడిగే అవకాశం ఉండేది. స్ట్రయిక్ రేట్‌తో పోలిస్తే పోటీ చేస్తున్న సీట్ల సంఖ్యకు పెద్దగా ప్రాముఖ్యత లేదు’ అని పవన్ అన్నారు. జనసేన పోటీ చేస్తున్న ఈ కొద్ది స్థానాల్లో కూడా అత్యధిక స్థానాలు గెలిచేందుకు ప్రయత్నించాలని ఆయన జనసైనికులకు పిలుపునిచ్చారు.
బీజేపీతో కొన్ని సీట్లను పంచుకోవాల్సి ఉన్న దృష్ట్యా జనసేన పరిమితం అవుతోందని పవన్ అన్నారు. టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ మద్దతు ఉంటుందని, చర్చల తర్వాతే సీట్ల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాను కూటమిలో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు జనసేన అధినేత చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే పార్టీలో నిబద్ధత కలిగిన జనసైనికులందరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా అడ్డుకోవడమే కూటమి ప్రధాన లక్ష్యం అని, అదే సమయంలో ఎన్నికల్లో కూటమి కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ప్రజల భద్రమైన భవిష్యత్తు కోసమే అధికార వైసీపీ దౌర్జన్యాలు, వేధింపులను జనసేన క్యాడర్ భరిస్తోందన్నారు.