Prajwal Revanna : భారత్ కు వస్తున్నా.. నిర్దోషిగా నిరూపించుకుంటా..: ప్రజ్వల్ రేవణ్ణ
Prajwal Revanna : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తాను తిరిగి భారత్ కు వస్తున్నట్లు తెలిపారు. మే 31న సిట్ ఎదుట హాజరవుతానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ తన ప్రత్యర్థులు పన్నని రాజకీయ కుట్రలో భాగంగానే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆరోపణలపై న్యాయపరంగా పోరాడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానన్నారు.
ప్రజ్వల్ తన తల్లిదండ్రులు, తాత, బాబాయ్ హెచ్ డీ కుమారస్వామి, జెడి(ఎస్) కార్యకర్తలకు క్షమాపణ తెలిపారు. ఈ కేసు నుంచి తాను బయటపడతానని అన్నారు. వందలాది మంది మహిళలపై తాను అత్యాచారం చేశానని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలు చేసిన ఆరోపణల కారణంగా తాను డిప్రెషన్ లోకి వెళ్లానని ప్రజ్వల్ వీడియోలో తెలిపాడు.
ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా హసన్ లో ఓటు వేసిన ఒకరోజు తర్వాత ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయారు. ఈ క్రమంలో సీబీఐ ద్వారా సిట్ చేసిన అభ్యర్థన మేరకు రేవణ్ణ ఆచూకీపై సమాచారం కోరుతూ ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. అంతేకాకుండా సిట్ నుంచి వచ్చిన దరఖాస్తు ఆధారంగా ఎన్నికైన ప్రతినిధుల కోసం ప్రత్యేక కోర్టు మే 18న అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.