Budget 2024 : వ్యవ‘సాయం’..రూ.1.27లక్షల కోట్లు.. కిసాన్ సమ్మాన్ నిధి పెంపు లేనట్టే..

Budget 2024 Agricultural 'Saayam

Budget 2024 Agricultural ‘Saayam’

Budget 2024 : రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వ్యవసాయ రంగంలో విలువ జోడింపునకు మరింత కృషి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ద్వారా 38లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని, 10 లక్షల మందికి ఉపాధి లభించిందన్నారు. ‘మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ యోజన’ ద్వారా 2.4లక్షల స్వయం సహాయక బృందాలు, వ్యక్తిగతంగా మరో 60వేల మందికి రుణ సాయం అందించినట్లు చెప్పారు. పంట కోత అనంతరం నష్టాల నివారణ, దిగుబడి, ఆదాయం పెంపు కోసం వివిధ చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొత్తం మీద వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు రూ. 1.27లక్షల కోట్లు, మత్స్య, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖకు రూ.7,105కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు.

వ్యవసాయ రంగంలో మరింత వృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. సేకరణ, ఆధునిక నిల్వ వసతులు, సమర్థ సరఫరా వ్యవస్థ, ప్రాథమిక- సెకండరీ ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి వాటిలో పబ్లిక్ ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తామన్నారు. నానో-యూరియా విధానం విజయవంతమైన నేపథ్యంలో నానో డీఏపీని అన్ని అగ్రో-క్లైమేటిక్ జోన్లకు విస్తారిస్తామన్నారు.

సాధారణంగా బస్తాల్లో డీఏపీ గుళికల రూపంలో ఉంటుంది. అదే నానో డీఏపీతో ద్రవరూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఎకరానికి అర లీటర్ నానో డీఏపీ సరిపోతుందని సైంటిస్టుల అంచనా. రైతులు ఎకరానికి రెండు బస్తాల డీఏపీ వేస్తుండగా.. సగటున రూ.3వేలు ఖర్చవుతుంది. నానో డీఏపీ అర లీటర్ సీసా ధర రూ.600 ఉంటుందని అంచనా.

అలాగే పాడి రైతుల కోంస సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని మంత్రి చెప్పారు. గాలికుంటు వ్యాధి నియంత్రణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రకటించారు. పశు పోషణ కోసం ‘మౌలిక సదుపాయాల అభివృద్ధి  నిధులు’ వంటి పథకాల ఆధారంగా కొత్త ప్రోగ్రాంను రూపొందిస్తామన్నారు.

2022లో ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్ అభియాన్’లో భాగంగా వేరుశనగ, నువ్వులు, ఆవ, పొద్దుతిరుగుడు, సోయాబీన్ నూనె గింజల్లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అందులో భాగంగా అధిక దిగుబడుల విత్తన రకాలపై పరిశోధన, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విలువ జోడింపు, పంటల బీమా తదితరాలపై దృష్టి సారిస్తామన్నారు.

మత్స్యకారుల కోసం ‘‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ అమలును మరికొన్ని లక్ష్యాల సాధనకూ విస్తరిస్తామన్నారు. ఎగుమతులను రెట్టింపు చేసి రూ.లక్ష కోట్లకు చేర్చుతామని తెలిపారు. సమీప భవిష్యత్ లో ఈ రంగంలో 55లక్షల మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తామన్నారు.

ఇదిలా ఉండగా రైతుల కోసం ఎన్నికల ముందు కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.9వేలకు పెంచుతామన్నారు. కానీ అలాంటి ప్రతిపాదనేది ఈ బడ్జెట్ లో చేయకపోవడం గమనార్హం.

TAGS