Rain Alert: వాయువ్య, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్రంగా మారింది. దానికితోడు 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వైపు పయనిస్తుందని, సోమవారం (సెప్టెంబరు 9) నాటికి వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం తెలిపింది.
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశముంది. మరికొన్ని జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అదే సమయంలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది.