Minister Nimmala: మంత్రి రామానాయుడిని అభినందించిన సీఎం చంద్రబాబు
Minister Nimmala: బుడమేరు గండ్లు పూడ్చివేత పనులను రేయింబవళ్లు పర్యవేక్షించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం గట్టు ఎంత ఎత్తు పెంచారని నిమ్మలను సీఎం అడిగి తెలుసుకున్నారు. బుడమేరు గట్టు ఎత్తు పెంచి బలోపేతం చేయాలని సూచించారు. పులివాగు పొంగుతుండడంతో మరింత వరద వచ్చే అవకాశముందని, మరో రెండు రోజులు అలర్ట్ గా ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
బుడమేరు కట్ట పైనే అధికారులు, సిబకబందితో మకాం వేసి నిద్రాహారాలు మాని మంత్రి రామానాయుడు పని చేశారు. గండ్లు పూడ్చడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయించారు. రంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బందికి సైతం సలహాలు, సూచనలు ఇస్తూ పనులు చేయించారు. నిన్న (శనివారం) పూడ్చివేత పనులు పరిశీలించేందుకు వచ్చిన మంత్రి నారా లోకేశ్ సైతం నిమ్మల పడుతున్న కష్టాన్ని చూసి మెచ్చుకున్నారు. నిమ్మల కృషికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మంత్రి అంటే ఇలా ఉండాలని పలువరు నెటిజన్లు నిమ్మల రామానాయుడుని అభినందించారు.