Cheetah: రాజమండ్రి శివారులో చిరుత కలకలం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Cheetah: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగర శివారులో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. చిరుతను తిరిగి అడవిలోకి పంపేలా తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజమండ్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు పుష్కరవనం మధ్యలో అటవీశాఖ సిబ్బంది నివాసాల వద్ద చిరుత ఓ జంతువుపై దాడి చేసి జాతీయ రహదారిని దాటడాన్ని వాహనదారులు గమనించారు. వెంటనే వారు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వెంటనే స్పందించి అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలో చిరుతపులి కదలికలు తెలుసుకునేందుకు 36 ట్రాప్ కెమెరాలు అమర్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రెండు కెమెరాల్లో చిరుత పులి కదలికలు రికార్డయ్యాయని, జన సంచారం ఉన్న రిజర్వ్ ఫారెస్టు పరిసరాల్లోనే చిరుత సంచరిస్తోందని అన్నారు. దానిని తిరిగి అడవిలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో చిరుతను బంధిస్తామన్నారు. అందుకోసం రెండు బోన్లు కూడా అందుబాటులో ఉంచామని వెల్లడించారు.

TAGS