Ayyappa Maladharana : శ్రీసాయిదత్త పీఠం ఆధ్వర్యంలో మాలాధారణ

Ayyappa Maladharana
Ayyappa Maladharana : కార్తీకం వచ్చిదంటే చాలు ఆలయాలు, వీధులు, కూడళ్లు అయ్యప్ప స్వామి శరణు ఘోషలతో ప్రతిధ్వనిస్తుంటాయి. కార్తీకం పరమ శివుడికి ఇష్టమైనమాసం కాబట్టి అదే మాసంలో హరి హర సుతుడిని కొలిచేందుకు భక్తులు సిద్ధం అవుతుంటారు. మండల (41 రోజులు), లేదా 21, లేదా, 15 రోజుల దీక్ష చేపట్టి స్వామి వారిని కొలుస్తుంటారు. చలి కాలంలో చన్నీటి స్నానం ఆచరించి ఉదయం, సాయంత్రం వేళ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. మధ్యాహ్నం స్వాములంతా ఒక చోట చేరి భిక్ష చేస్తారు.
శ్రీ దత్తపీఠం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ శివ విష్ణు దేవాలయంలో మాల ధారణ కార్యక్రమం గురువారం (నవంబర్ 16) భక్తి శ్రద్ధలతో జరిగింది. శ్రీ రఘుశర్మ శంకర మంచి స్వామి వారు స్వాములకు మాలాధారణ చేశారు. అమెరికలోని న్యూజెర్సీ ప్రాంతం ఆలయం ప్రాంగణం అయ్యప్ప నామ స్మరణ, స్వాముల కుటుంబ సభ్యులతో సందడిగా కనిపించింది. మాలాధారణ స్వీకరించిన స్వాములు గురుస్వామి ఆశీర్వచనం తీసుకున్నారు.
ఆలయం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు, పూజలు, భిక్ష గురించి మాలాధారణ స్వాములకు వివరించారు. ప్రతీ ఒక్క స్వామి ఆలయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మాలా ధారణ స్వాములకు భిక్ష, తదితర పూజలను నిర్వహించేందుకు దాతలు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నట్లు వారికి హరి హర సుతుడి ఆశీర్వాదం ఉండాలని నిర్వాహకులు కోరారు.