Grand Diwali celebrations In Poland : పోలండ్ లో ఘనంగా దీపావళి వేడుకలు.. భారత సంప్రదాయ నృత్యాలతో అలరించిన పోలండ్ వాసులు
Grand Diwali celebrations In Poland : పోలండ్ తెలుగు అసోసియేషన్ (PoTA), తమిళ్ సంఘం అసోసియేషన్ ఆఫ్ పోలండ్ (TSAP) సంయుక్తంగా పోలండ్ లో మొదటి సారి వైభవంగా దీపావళి ఈవెంట్ నిర్వహించారు. ఇండియా ఎంబసీ ఈ ఈవెంట్ కు మద్దతివ్వగా.. దేశ రాజధాని వార్సాలో ఆదివారం (నవంబర్ 19) రోజు కన్నుల పండువగా జరిగింది.
ముఖ్య అతిథిగా పోలండ్‌లోని భారత రాయబారి శ్రీమతి నగ్మా మొహ్మద్ మాలిక్‌తో పాటు, వివిధ దేశాల భారత రాయబారులు, పోలండ్ కౌన్సిల్ జనరల్స్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ ను ఉద్దేశించి భారత రాయబారి కీలక ప్రసంగం చేశారు. కులం, మతం, భాషల తారతమ్యాలు లేకుండా భారతీయులను ఏకతాటిపైకి తీసుకచ్చేందుకు పొలండ్ తెలుగు అసోసియేషన్ విజయం సాధించిందని అసోసియేషన్ అధ్యక్షుడు చంద్ర భాను, ఫౌండర్ హరి చందు తెలిపారు.
ఈ గ్రాండ్ ఫెస్టివల్‌లో తెలుగు, తమిళం, పోలిష్, యూరోపియన్ పౌరులతో సహా పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లోప్రదర్శనలు, మ్యాజిక్ షో, చిన్నారులకు ఫేస్ పెయింటింగ్, సరదా ఆటలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు రాత్రి 8:30 గంటల వరకు కొనసాగాయి. ఈ ఈవెంట్ చివరలో అద్భుతమైన డీజే డాన్స్ కార్యక్రమానికే హైలట్ గా నిలిచింది. పోలండ్ కళాకారులు భారతీయ సంప్రదాయ నృత్యాలు చేయడం బాగా ఆకట్టుకుంది. ప్రదర్శనల్లో పాల్గొన్న వారికి జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందించారు.
ఈ వేడుకలు సజావుగా పూర్తయ్యేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన PoTA టీమ్ – సరోజినీ కందుల (భవాని), కాంతిలత చితికిరెడ్డి (మధు), విశ్వశాంతి గద్దేపల్లి, స్వాతి అక్కల, కిరణ్మయి, నీహారిక గుండ్రెడ్డి, శశికళ కాట్రగడ్డ, సురేష్ పెరుమాళ్ల, భార్గవ్ రామ్ దెందుకూరి, బాపిరాజు ధుమంతారావు, రాజశేఖర్ యేసిరెడ్డి, రామసతీష్ రెడ్డి, సుబ్బిరామి రెడ్డి భావిరెడ్డి, సందీప్ శ్రీనాథుని, పృథ్వీ ఆళ్లను ప్రతీ ఒక్కరూ అభినందించారు.
వలంటీర్లు నిధీష్ అక్కల, మేధా అక్కల, భూమిజ, ఆదిత్య కందుల, సౌమిత, కౌశిక్ నెరియనూరికి ధన్యవాదాలు తెలిపారు. తర్వాత తెలుగు వారికి ఇష్టమైన రుచికరమైన భోజనాలు, వెజ్ అండ్ నాన్ వెజ్ తో విందు ఏర్పాటు చేశారు. కర్రీ కింగ్ (Curry King) రెస్టారెంట్ ఆధ్వర్యంలో భోజనాలు పెట్టారు.
ముగింపు వేడుకల్లో భాగంగా పోలండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రాత్రి వేళ బాణాసంచా కాల్చారు. భారీగా మంచుపడుతున్నా లెక్క చేయకుండా ప్రవాసులు ఆనందంగా పటాకలు కాల్చి సంబురాలను విజయవంతం చేశారు.