TDP And Janasena Fans : స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ నుంచి ఆయనకు మద్దతు విపరీతంగా పెరిగిపోయింది. ఇటు ఏపీలోనే కాకుండా ప్రవాసాంధ్రుల్లో సైతం ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక జనసేన కూడా టీడీపీకి తోడవడంతో అందరూ ‘మేము సైతం బాబు కోసం’ అంటూ ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికా, న్యూజెర్సీలో ఆత్మీయ సమవేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూర్ పశ్చిమ నియోజకవర్గం నాయకుడు మన్నవ మోహన్ కృష్ణ పాల్గొన్నారు. మన్నవ మాట్లాడుతూ చంద్రబాబు అంటే మచ్చలేని మనిషన్నారు. ఆయనకు అవినీతి రంగు పులిమేందుకు జగన్ తెగ ఆరాటపడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయిన సమయంలో అన్ని రంగాల్లో వెనుకబడిన రాష్ట్రాన్ని ముందుకు నడిపేందుకు ఆయన ఎంతో శ్రమించారన్నారు.
2024 ఎన్నికలు ఏపీకి అత్యంత ముఖ్యమని చెప్పిన మోహన్ కృష్ణ టీడీపీ-జనసేన కూటమి గెలుపునకు ప్రతీ ఒక్క కార్యకర్త, ప్రవాసాంధ్రుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సమావేశంలో ‘మేము సైతం బాబు కోసం’ అన్న ప్లకార్డులను చూపుతూ నినాదాలు చేశారు. బాబు అరెస్ట్ ను ఖండిస్తూ తనకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేసి ఆమోదించారు.
2024లో టీడీపీ-జనసేనకు ప్రతీ తెలుగువాడు మద్దతివ్వాలని ఆత్మీయ సమావేశం తీర్మానించింది. అయితే అక్కడ ఉన్న విపరీతమైన చలిని లెక్కచేయకుండా ఆత్మీయ సమావేశానికి 500 మందికి పైగా ప్రవాసులు వచ్చారు. రమేష్ నూతలపాటి,శ్రీహరి మందడి, వంశీ వెనిగళ్ల, మోహన్ కుమార్, వెంకట్ సూడ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు వారు కృషి చేశారు.