TANTX Diwali Celebrations : అలరించిన TANTX దీపావళి వేడుకలు
TANTX Diwali Celebrations : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (TANTX) 1986లో తెలుగు వారు ఏర్పాటు చేశారు. టెక్సాస్‌లోని ప్రవాస తెలుగువారి కోసం పని చేస్తుంది. తెలుగు సమాజాన్ని ప్రధాన స్రవంతి అమెరికన్ సమాజంలోకి చేర్చడానికి ఈ సంస్థ చొరవ తీసుకుంటుంది. సంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాంఘిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ తెలుగు వారి కోసం విశేషంగా సేవలందిస్తుంది.
వీటితో పాటు డల్లాస్‌లోని ప్రాంతీయ రేడియో ఛానెల్‌లో ‘రేడియో సలామ్’, ‘ఫన్ ఆసియా’ పేరుతో ప్రతి వారం కొన్ని గంటల పాటు తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులతో ఈ సంస్థ నిర్వహించబడుతుంది.
ఈ సంస్థ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది. దీని ఆధ్వర్యంలో మార్‌తోమా చర్చిలో దీపావళి-2023 వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు శరత్ రెడ్డి యర్రం, మేనేజ్‌మెంట్ బోర్డ్ అధ్యక్షుడు అనంత్ మల్వరపులు అధ్యక్షత వహించారు. స్థానికంగా ఉన్న పాఠశాలల విద్యార్థులు పలు సంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. ఎస్పీ చరణ్, ఎస్పీ శైలజ, శ్రీష, సాయి విఘ్నేష్ సింల్లి ఎస్‌పీబీ (Simply SPB) పేరుతో ఆవిష్కరించిన గానలహరి అలరించింది. అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గాయకులను పూల మాలలు, జ్ఞాపికలు, శాలువాలతో సన్మానించారు.
ప్రతీ ఏటా సంస్థ ఆధ్వర్యంలో వివిధ సంస్కృతిక, సాంఘిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు శరత్ రెడ్డి తెలిపారు. 2023 సంవత్సరానికి సంబంధించి వివిధ ఈవెంట్లు, వేడుకలకు విరాళాలు ఇచ్చిన దాతలకు ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. మరింత మంది దాతలు ముందుకు రావాలని ఆయన ఈ కార్యక్రమంలో తెలుగు సమాజాన్ని కోరారు.