JAISW News Telugu

Dawood Ibrahim:అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంపై విష‌ప్ర‌యోగం?

Dawood Ibrahim:గ‌త కొన్నేళ్లుగా ప‌రారీలో ఉన్న అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్, ముంబాయి పేలుళ్ల సూత్ర‌ధారి దావూద్ ఇబ్ర‌హీం తీవ్ర అనారోగ్యంతో క‌రాచీలోని ఓ ఆసుప‌త్రిలో చేరిన‌ట్లు స‌మాచారం. అత‌డిపై విష ప్ర‌యోగం జ‌రిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. భారీ భ‌ద్ర‌త న‌డుమ అత‌డికి ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రిత‌మే దావూద్ ఇబ్ర‌హీంను ఆసుప‌త్రిలో చేర్పించార‌ని తెలుస్తోంది.

మీడియా క‌థ‌నాల ప్ర‌కారం క‌రాచీలోని ఓ ఆసుప‌త్రిలో ఫ్లోర్ మొత్తం ఖాలీ చేసి కేవ‌లం దావూద్ ఒక్క‌డినే ఉంచి చికిత్స అందిస్తున్నారు. కేవ‌లం డాక్ట‌ర్లు, కుటుంబ స‌భ్యుల‌ను మాత్ర‌మే ఆ అంత‌స్తుకు అనుమ‌తిస్తున్నారు. అయితే ఈ వార్త‌ల‌పై ఎలాంటి అధికారిక ధృవీక‌ర‌ణ లేదు. ఈ వార్త‌ల‌పై దావూద్ స‌మీప బంధువుల నుంచి స‌మాచారం సేక‌రించేందుకు ముంబాయి పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లో నిన్న‌ అర్థ్ర‌రాత్రి నుంచే ఇంట‌ర్నెట్ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగిన‌ట్టుగా తెలుస్తోంది. యూట్యూబ్‌, ఫేస్‌బుక్ వంటి సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్‌లు కూడా డౌన్ అయిన‌ట్టుగా స‌మాచారం. ముఖ్యంగా క‌రాచీ, లాహోర్, రావిల్పిండి వంటి ప్రాంతాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిచిపోయిన‌ట్లు పాక్‌లో కొన్ని మీడియా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. 1993లో ముంబాయిలో జ‌రిగిన వ‌రుస బాంబు పేలుళ్ల త‌ర్వాత దావూద్ ఇబ్ర‌హీం పాకిస్థాన్‌కు పారిపోయాడు.

అయితే అత‌ను త‌మ దేశంలో ఉన్న‌ట్టు పాక్ ఇంత వ‌ర‌కు అంగీక‌రించ‌లేదు. కానీ దావూద్ క‌రాచీలోనే ఉన్నాడ‌ని, అత‌డి సోద‌రి హ‌సీనా పార్క‌ర్ కుమారుడు అలీషా పార్క‌ర్ చెప్పిన‌ట్లు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఈ ఏడాది జ‌న‌వ‌రిలో దాఖ‌లు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అంతే కాకుండా దావూద్ ముఠా క‌రాచీ ఏయిర్ పోర్ట్‌ను నియంత్రిస్తున్న‌ట్లు ఎన్ఐఏ వెల్ల‌డించింది. దావూద్ రెండో పెళ్లి కూడా చేసుకున్న‌ట్లు స‌ద‌రు ఛార్జ్‌షీట్‌లో స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే దావూద్‌ను ఐక్య‌రాజ్య స‌మితి అంత‌ర్జాతీయ తీవ్ర‌వాదిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2018లో ఐరాస విడుద‌ల చేసిన అంత‌ర్జాతీయ ఉగ్ర సంస్థ‌లు, ఉగ్ర‌వాదుల జాబితాలో దావూద్ పేరు క‌రాచీ అడ్ర‌స్‌తో ఉండ‌టం గ‌మ‌నార్హం.

Exit mobile version