JAISW News Telugu

Yoga : యోగవిద్య యువతి ప్రాణాన్ని కాపాడింది

Yoga Saved life : యోగవిద్య ఓ యువతి ప్రాణాన్ని కాపాడింది. గొంతు నులిమి చంపేశామనుకొని దుండగులు గోతిలో పడేసినా.. యోగవిద్యతో ఊపిరి నిలబెట్టుకొని ఆ యువతి ప్రాణాలతో తిరిగి వచ్చిన ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లా దిబ్బూరహళ్లిలో జరిగింది. దేవనహళ్లికి చెందిన యువతి (34) భర్త నుంచి విడిపోయి దిబ్బూరహళ్లిలో ఒంటరిగా ఉంటోంది. సంతోష్ కుమార్ రెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పరిచయమై అది కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో గానీ సదరు యువతిని హత్య చేసేందుకు సంతోష్, ఆమె దగ్గర యోగా నేర్చుకుంటున్న సతీష్ రెడ్డి సాయం కోరాడు.

ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వహించే సతీష్ రెడ్డి, అతని సహచరులు రమణ, సల్మాన్, రవిలతో పాటు సంతోష్ కలిసి ఆ యువతిని అక్టోబరు 23న అపహరించారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించారు. ఆమె కేకలు వేయడంతో గొంతు నులిమి చనిపోయిందని నిర్దారించుకొని ఓ గుంత తీసి అందులో ఆమెను పడేసి వెళ్లిపోయారు. యోగ సాధనలో పరిణతి ఉన్న ఆ యువతి శ్వాసను నియంత్రించి చనిపోయినట్లు నటించింది. నిందితులు అక్కడి నుంచి వెళ్లాక గుంత నుంచి బయటపడింది. స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ కుశాల్ చౌక్సే తెలిపారు. ప్రధాన నిందితుడు సంతోష్ కోసం పోలీసులు వెదకుచున్నారు.

Exit mobile version