Pawan Kalyan : ఎర్రచందనం స్మగ్లర్ల బీఎండబ్ల్యు కార్లు ఏమయ్యాయి?.. వివరాలు కోరిన పవన్ కల్యాణ్
Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అటవీశాఖకు సంబంధించి రెండు అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల గురించి ఆరా తీశారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఈ రెండు కార్లను స్వాధీనం చేసుకోగా అవి మాయమయ్యాయి. ఈ కార్లలో ఒకటి 2017 నవంబరులో అప్పటి అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాముకు కేటాయించగా.. ఆ తర్వాత ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో ఉన్నారు.
అయితే, ఆ తర్వాత ఆ కారు ఏమైందో ఎవరికి తెలియకపోవడం విశేషం. అధికారులు తమకు తెలియదని చెప్తున్నారు. ఈ మేరకు ఆ కారు ఏమైందో, ఎక్కడుందో తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి కార్యాలయం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్ ను ఆదేశించారు.
2017లో అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలో క్రైం నంబర్ 414/2017 నమోదు కాగా, ఈ కేసులో ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి టీఎన్ 05 బీహెచ్ 3303 నంబరు బీఎండబ్ల్యూ కారును అటవీ అధికారులుస్వాధీనం చేసుకున్నారు. అయితే, 2017 డిసెంబరు 11న కాన్ఫిస్ కేట్ (ప్రభుత్వ స్వాధీనం) కాకముందే ఆ వాహనాన్ని అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనంతరాముకు కేటాయిస్లూ అప్పటి అటవీ దళాల అధిపతి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం అది ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి టీఎన్ 18కే 2277 బీఎండబ్ల్యూ బ్లూ కలర్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారును 2015 ఫిబ్రవరిలో అప్పటి అటవీశాఖ మంత్రి అదనపు ప్రైవేటు కార్యదర్శికి కేటాయించగా, ఆ తర్వాత ఆ కారు గురించి కూడా అటవీ అధికారులకు సమాచారం లేకపోవడం సంచలనంగా మారింది. అంతేకాదు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టీఎన్ 07 సీబీ 3724 టయోటా ఇన్నోవా వాహనం గురించిన వివరాలు కూడా లేవని తెలుస్తోంది.