Vijayawada: విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్ విమాన సర్వీసులు
Vijayawada: విజయవాడ నుంచి సింగపూర్, దుబాయ్ లకు అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన గ్రాండ్ ఎంట్రన్స్ వేను, విజయవాడ-ఢిల్లీ ఇండిగో సర్వీసును ఆయన ప్రారంభించారు. విజయవాడ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు.
‘‘కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలల్లోనే విజయవాడ నుంచి ముంబైకి రెండు, బెంగళూరు, ఢిల్లీకి ఒక్కోటి చొప్పున అదనంగా విమాన సర్వీసులను ప్రవేశపెట్టాం. ఈ చర్యలత ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి నెలకు లక్ష మందికి పై ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు నడిపేందుకు దశలవారీగా చర్యలు తీసుకోనున్నాం. దీనికి కావలసిన ద్వైపాక్షిక ట్రాఫిక్ రైట్స్ కోసం కృషి చేస్తాం. 2025 జూన్ నాటికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులను పూర్తి చేయాలన్నది లక్ష్యం’’ అని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎంపీ యదువీర్ వడియార్ తో పాటు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ కుమార్, ఎయిర్ పోర్టు జీఎం రామాచారి, ఎయిర్ పోర్టు డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి, జనసేన సమన్వయకర్త ముప్పా రాజా తదితరులు పాల్గొన్నారు.