Telangana Schools : మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ అనుబంధ గ్రామం గట్టుపల్లిలో ఒకే గదిలో రెండు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. కేస్లాపూర్ ప్రైమరీ స్కూల్ భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. దీంతో అక్కడి విద్యార్థులను అదే పంచాయతీలోని గట్టుపల్లి పాఠశాలకు తరలించారు. అక్కడ ఒక గది, వరండా మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఒకే గదిలో రెండు పాఠశాలలకు చెందిన 70 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ రెండు పాఠశాలలకు చెందిన 1 నుంచి 5వ తరగతి విద్యార్థులను కలిపే పాఠాలు చెబుతున్నారు. రెండు పాఠశాలల్లోని నలుగరు ఉపాధ్యాయులకు గాను ఒకరు డిప్యుటేషన్ పై వెళ్లగా ముగ్గురు ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కేస్లాపూర్ పాఠశాలకు మన ఊరు-మన బడి కింద రూ.12 లక్షల నిధులు మంజూరయ్యాయి. గట్టుపల్లి పాఠశాల భవనం పక్కనే కాంట్రాక్టరు పనులు ప్రారంభించి బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే నిలిపివేశారు.