JAISW News Telugu

YCP and BRS : వైసీపీ, బీఆర్ఎస్ పరిస్థితి దిగజారింది ఇలా..

YCP and BRS

YCP and BRS

YCP and BRS : తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై రాష్ట్రంలో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్. అటు తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దయనీయ స్థితికి దిగజారింది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో ఈసారి లోక్ సభలో తన ప్రాతినిధ్యం కోల్పోయింది. ఏకంగా 7 స్థానాల్లో గులాబీ పార్టీ డిపాజిట్ కోల్పోయింది. ముక్కోణపు పోటీలో కేవలం రెండు చోట్ల మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. నిజామాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి మహబూబ్ నగర్ స్థానాల్లో డిపాజిట్ కోల్పోయారు.

తెలంగాణలో బీఆర్ఎస్  ఇలా ఉంటే తాజా ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ పరిస్థితి ఇంతకంటే ఘోరంగా తయారైంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల గురించి సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ నడుస్తోంది. పార్టీ ఫర్ సేల్ అంటు నెటిజన్లు థంబ్ నేల్స్ పెడుతున్నారు. రెండూ దొందుకు దొందు గానే ఉన్నాయని అంటున్నారు కొంతమంది. ఈ రెండు పార్టీలకు వెలుగు అంతా గత వైభవంగా మారిపోయింది. వైసీపీ అయితే అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది. అధికారానికి దూరమై కష్టాలకు చేరువ అయి అత్యంత సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. ఏ రాజకీయ పార్టీకి అయినా ఓటములు గెలుపులు సహజం. కానీ ప్రాంతీయ పార్టీలుగా ఉంటూ అపరిమితమైన అధికారాన్ని ఎంజాయ్ చేస్తూ అదే శాశ్వతం అని భ్రమించిన నేపథ్యంలోనే ఇప్పుడు రెండు పార్టీలు ఇబ్బందులు పడుతున్నాయి. బీఆర్ఎస్ క్యాడర్ చూస్తే ఒక్కసారిగా వీక్ అయింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వరుసగా క్యాడర్ అంతా చేరుతున్నారు.

ఏపీలో వైసీపీ సీన్ చూసినా డిటో అన్నట్లుగానే ఉంది. 151 మంది ఎమ్మెల్యేలతో అప్రతిహతంగా అధికారం చలాయించిన వైసీపీకి తాజా ఎన్నికల ఫలితాలు బిగ్ షాక్ ఇచ్చాయి. ఏకంగా 11 సీట్లకు ఆ పార్టీ పడిపోయింది. వైసీపీకి మంచి క్యాడర్ ఉంది. కానీ దానిని పార్టీ అధినాయకత్వం నిర్లక్ష్యంతో పోగొట్టుకుంటోందంటున్నారు. ఓటు బ్యాంక్ కూడా ఒక్కసారిగా 50 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది. వైసీపీలో కానీ బీఆర్ఎస్ లో కానీ క్యాడర్ అయితే విసిగి ఉన్నారని అంటున్నారు. బీజేపీ చాలా మటుకు బీఆర్ఎస్ ఓట్లను పార్లమెంట్ ఎన్నికల్లో లాగేసింది. ఏపీలో చూస్తే ప్రస్తుతానికి ఏ ఎన్నికలూ లేవు. కానీ మరో రెండేళ్లలో లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల నాటికి కనుక వైసీపీ బలంగా పుంజుకోకపోతే మాత్రం క్యాడర్ తో పాటు లీడర్లు కూడా వేరే వైపు వెళ్తారు అంటున్నారు.

Exit mobile version