Amaravati: ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై ముంబై నటి వ్యవహారంతో పాటు పలు అభియోగాలు ఉన్నాయి.
గత ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో నటి జత్వానీపై నిబంధనలకు విరుద్ధంగా కేసు నమోదు చేశారని అభియోగం నమోదైంది. తమను ఏపీ పోలీసులు వేధించారంటూ విజయవాడ కమిషనరుకు జత్వాని కుటుంబం ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేశారు. డీజీపీ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ లపై వేటు వేశారు. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏసీపీ హనుమంత రావు, ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణను డీజీపీ సస్పెండ్ చేశారు.