Srivari Brahmotsavam : తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవ నిర్వహించారు. మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షిస్తున్నారు. మాడ వీధుల్లో కల్పవృక్ష వాహనం ముందు భక్తుల బృందాలు చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా వాహనసేవ వైభవంగా జరుగుతోంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారిక సాయంత్రం ఊంజల్ సేవ జరగనుంది.
రాత్రి సర్వ భూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.