Nalgonda:నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు దుర్మరణం
Nalgonda:నల్లగొండ జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. నల్గొండ జిల్లా పరిధిలోని కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో వేంపాడు స్టేజీ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తితోపాటు బైక్ పై వ్యక్తి ఇద్దరూ మృతి చెందారు. వీరి మృతదేహాలను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. బైకిస్టు మృతి సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఓ టాటాఏసీ ఆటోలో ఆస్పత్రికి బయలు దేరారు.
ఏడుగురు టాటాఏసీ ఆటోలో వెళ్తున్నక్రమంలో పార్వతీపురం ఎక్స్ రోడ్డు వద్ద ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చిన లారీ ట్యాంకర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. సుమారు 50 మీటర్ల మీర లారీ ఆటోను నెట్టుకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురిలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదానికి కారణం లారీని క్లీనర్ నడుపుతుండటంతోపాటు మద్యం మత్తులో నడపడమే కారణమని తెలుస్తోంది. బైక్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలోనే లారీ, టాటాఏసీ వాహనం ప్రమాదం జరిగింది. బైక్ ప్రమాదంలో రమావత్ సేవలు (శివ నాయక్ (20), బలుగూరి సైదులు (55) మృతిచెందారు. లారీ ఢీకొట్టిన ప్రమాదంలో మూడువ బుజ్జి(40), రమావత్ పాండు (45), రమావత్ గణ్య (48),మూడవ నాగరాజు (28) మృత్యువాత పడ్డారు. మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాదాలపై కేసీఆర్ దిగ్భ్రాంతి
ఈ ఘటనపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అయ్యారు. నల్లగొండ జిల్లాలో జరిగిన వేరు వేరు రోడ్డు ప్రమాదాల దుర్ఘటనలపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల్లో పలువురు మృత్యువాత పడటంపై తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కేసీఆర్ కోరారు.