Minister Ramprasad Reddy: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ రోడ్డు ప్రమాదంలోని మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. క్షతగాత్రులకు రూ. లక్ష ఇస్తామని అన్నారు. ఈ ఘటనలో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి బీమా ద్వారా రూ.80 లక్షల వరకు అందుతాయని చెప్పారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
రహదారులపై బ్లాక్ స్పాట్స్ గుర్తించేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఏపీని యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని వివరించారు. వైసీపీ పాలనలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ కు ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. విజయవాడ వరద బాధితులను 20 నిమిషాలు పరామర్శించి ఆయన రాజకీయాలు చేస్తున్నారని మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు.