EMI : రిజర్వు బ్యాంక్ (RBI) గవర్నర్ గా శక్తికాంత దాస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఆర్థిక పరమైన లావాదేవీపై నిర్ణయాల్లో అస్సలు అలసత్వం చూపడం లేదు. బ్యాంకుల తీరుపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో సంస్కరణలు కూడా తెస్తున్నారు. బ్యాంకుల ఆటలకు చెక్ పెడుతూ వినియోగదారులకు స్వాంతన కలిగిస్తున్నారు.
యూపీఐ విజయవంతం చేసేందుకు నిబంధనలు పాటించని సంస్థలపై ఉక్కుపాదం మోపారు శక్తికాంత్ దాస్. దానిలో చాలా మార్పులు దాస్ నేతృత్వంలోనే జరిగాయి. తాజాగా.. రుణ గ్రహీతలకు ఊరటనిచ్చారు. కంపెనీలు రుణ ఖాతాలపై జరిమానా విధించే విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం బ్యాంకులు మరియు ఫైనాన్స్ కంపెనీలు లోన్ చెల్లింపు గడువు నాటికి డిఫాల్ట్, ఇతర రుణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రుణగ్రహీతలపై జరిమానాలు విధించే వీలు లేదు.
నెలవారీ చెల్లించాల్సిన EMI ఆలస్యంగా చెల్లించినందుకు బ్యాంకులు రుణ గ్రహీతలపై జరిమానా వేస్తాయి. అయితే, ఆర్‌బీఐ కొత్త ఆదేశాలతో ఇక వారి ఆటలు కట్టడి చేసింది. ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు జరిమానా వడ్డీని వసూలు చేయవద్దని ఆదేశించింది. లోన్ డిఫాల్ట్ సమయంలో వడ్డీ రేటుకు అదనపు ఛార్జీలు వేయడాన్ని సెంట్రల్ బ్యాంక్ నిషేధించింది. అయినా కూడా బ్యాంకులు ఇప్పటికీ గ్రహీతలపై జరిమానా వేస్తూనే ఉన్నాయి.
పెనాల్టీ ఉద్దేశ్యం క్రెడిట్ క్రమశిక్షణ మాత్రమే అని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. కానీ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దీన్ని ఉపయోగించుకొని అధికంగా వసూలు చేయడాన్ని తప్పుపట్టింది. అదనపు చార్జీలు వాటిపై చార్జీలు వేసి బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు తమ ఆదాయాన్ని ఈ మార్గంలో కూడా పెంచుకుంటున్నాయని గమనించింది. దీనికి తోడు ఇలాంటి వాటిపై ఫిర్యాదులు పెరగడంతో రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగింది.
ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న అన్ని రుణాలకు 2024, జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు వర్తిస్తాయి. దీనికి ముందు రిజర్వు బ్యాంక్ అమలు తేదీని జనవరి 1 నుంచి ఏప్రిల్ 1కి మార్చారు. ఈ మార్గదర్శకాలు కార్పొరేట్, రిటైల్ రుణాలకు ఒకేలా ఉండనున్నాయి.