TTD Chairman BR Naidu : గత ప్రభుత్వం తిరుమలలో చాలా అరాచకాలు చేసిందని టీటీడీ ఛైర్మన్, టీవీ5 అధినేత బీఆర్ నాయుడు అన్నారు. తాజాగా ఆయన తనకు పదవి ఇవ్వడంపై స్పందించారు. తనకు ఇంత గౌరవమైన పదవి ఇచ్చినందుకు సీఎం చంద్రబాబు ఎన్డీయే పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అర్చకుల నుంచి వేదాశీర్వచనం తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదికి ఐదారు సార్టు తిరుమలకు వెళ్లే వాళ్లమని, గడిచిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా తిరుమలకు వెళ్లలేదన్నారు. గత ప్రభుత్వం తిరుమలలో అనేక అరాచకాలు చేసిందని ఆరోపించారు.
తాను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగానని, చిన్నప్పటి నుం, తిరుమల ఆలయానికి తప్ప మరో ఆలయానికి వెళ్లలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని బీఆర్ నాయుడు చెప్పారు. టీటీడీ ఛైర్మన్ పదవి రావడం తన జీవితంలో కొత్త మలుపుగా భావిస్తున్నా అని, ప్రతిష్టాత్మకంగా తీసుకుంటానని అన్నారు. తిరుమలలో చాలా సమస్యలున్నాయని, వాటిపై చంద్రబాబుతో గతంలోనే చర్చించినట్లు చెప్పారు. ఛైర్మన్ గా మరోసారి చర్చించి, ఆయన సలహాలతో ముందుకెళ్తామని తెలిపారు. తిరుమలలో పనిచేసేవారు హిందువులై ఉండాలన్నారు. టీటీడీ ఆస్తుల్ని కాపాడేలా చర్యలు తీసుకుంటామని, అలాగే టీటీడీ భూములపై కమిటీ వేస్తామని బీఆర్ నాయుడు చెప్పారు.