PM Modi : ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్షలు తప్పవు

పాహల్గామ్ ఘటన భారత ఆత్మపై దాడి – ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పాహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదులకు, వారికి సహకరించిన వారికి కలలో కూడా ఊహించని రీతిలో శిక్షలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. పాహల్గామ్ ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయిందని, మృతుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు.

బీహార్ వేదికగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేశామని తెలిపారు. ఈ దారుణ దాడిలో కొందరు పిల్లలను కోల్పోయారని, మరికొందరు తమ భర్తలను, తండ్రులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదని, భారత ఆత్మపైనే జరిగిన దుస్సాహసమని ఆయన అభివర్ణించారు.

ఉగ్రవాదాన్ని తుదముట్టించే సమయం ఆసన్నమైందని పేర్కొన్న ప్రధాని, ఈ దాడికి పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాద నిర్మూలనకు దేశం కట్టుబడి ఉందని, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

TAGS