Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు వాయుగుండంగా మారే అవకాశం
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. ఇది ఈ నెల 25 నాటికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో నవంబరు 27, 28, 29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈ నెల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 29 నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలో నవంబరు 25 నాటికి వాయుగుండం మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వాయుగుండం ఏర్పడిన తర్వాత వాయువ్య దిశగా కదులుతూ తదుపరి రెండు రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాలవైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఇవాళ, రేపు ఏపీలో వాతావరణం పొడిగానే ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
నవంబరు 26 నుంచి ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నవంబరు 27, 28, 29 తేదీల్లో ఉత్తర, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఐఎండీ పేర్కొంది. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.