leopard Missing : గత కొన్ని రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని కడియం పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం ఆందోళన కలిగిస్తోంది. దాని జాడ కోసం ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది పరిశీలించారు. వాటిలో ఎలాంటి ఆచూకీ లభించలేదు. గత మంగళవారం నుంచి కడియం పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. దీంతో అధికారులు 20 ట్రాప్, పది సీసీ కెమెరాలు, రెండు బోన్లు ఏర్పాటు చేశారు.
శుక్రవారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోంది. కడియపులంకలో వర్షం కారణంగా పాదముద్రలు లభించలేదు. చిరుత కడియపులంక పరిసరాల్లోనే ఉందా, లేదా గోదావరి లంకల వైపు తరలిపోయిందా అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో కడియపులంక పరిసరాల్లో నర్సరీ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.