Laddu prasadam
Laddu prasadam : ఎవరు ఏమన్నా.. తిరుమల లడ్డూ.. లడ్డూనే. ఇంతకంటే మంచి ప్రసాదం మరెక్కడా లేదు. ఆ రుచి, ఆ ఘుమఘుమ.. నోటిలో కరిగిపోయే తీరు.. ఆ స్వచ్ఛత, తాజాదనంతో పాటు స్వామి పట్ల అపారమైన భక్తి… ఇవన్నీ కలిసి.. తిరుమల లడ్డూలతో మనకు విడదీయరాని బంధాన్ని ఏర్పరిచాయి. ఈ లడ్డూ దేవుడికి, భక్తుడికి మధ్య ఉన్న అనుబంధంలా మారింది. అందుకే ఆ లడ్డూ తినకుండా ఉండలేం. కానీ ఇటీవల తిరుపతి లడ్డూ కలుషితం అయిందన్న ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
వాస్తవానికి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ అయిందన్న విషయం గురించి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు, టీడీపీ నేతలు చాలా తక్కువే మాట్లాడారు. కానీ ఆ వ్యవహారం గురించి వారి కంటే వైసీపీ నేతలు, వారి సొంతమీడియానే చాలా ఎక్కువగా మాట్లాడుతుండడం ఆశ్చర్యకరం. ఈ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ తప్పు చేశారని యావత్ దేశ ప్రజలు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో తిరుపతి లడ్డూ కల్తీ గురించే చర్చ జరుగుతోంది. ఈ విషయం వల్ల తమకు రాజకీయంగా బాగా నష్టం జరిగిందని, ఇంకా జరుగుతుందని వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ విషయంలో తాము ఆణిముత్యాలమని నిరూపించుకునేందుకు ఆ పార్టీ నేతలు ఈ వ్యవహారం గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. తమపై పడిన మరక శాశ్వతమని.. ఈ మరకను ఏ సబ్బుతో ఉతికినా పోగొట్టుకోలేమని వారు గ్రహించడానికి సమయం పడుతుంది.
అలాగని చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చోలేరు.. కనుక టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమల పుష్కరిణిలో స్నానమాచరించి “తాను ఏ తప్పు చేయలేదని, ఒకవేళ లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసినట్లు అయితే తాను తన వంశం నాశనం అయిపోతామని తనకు తానే శాపం పెట్టుకున్నారు. ఆ శాపం ఫలిస్తుందో లేదో కానీ టీవీల్లో ఆయన చేసిన హడావుడి చూసిన వారిలో కొందరైన “అయ్యో పాపం… ఆయన ఈ తప్పు చేసి ఉండరు. లేకుంటే అలా పెద్ద ప్రమాణం చేస్తారా? చేసి ఉండరు… కనుక కల్తీ జరగనేలేదని ప్రజలు నమ్ముతారని ఆయన చిన్న ఆశ.
మరో మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తరపున వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ వ్యవహారం పై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఏపీ హైకోర్టులో కూడా ఓ పిటిషన్ వేశారు. మాజీ సీఎం జగన్ కూడా రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా అందరికీ ఓ బహిరంగ లేఖ రాసి ట్విట్లర్లో పోస్ట్ చేశారు. అయితే ఈ ప్రయత్నాలన్నీ నష్ట తీవ్రతని తగ్గించడానికి చేస్తున్నవే కానీ జరిగిన నష్టాన్ని ఎవరూ మార్చలేరు. కాలక్రమంగా ఈ వ్యవహారంపై మీడియాలో చర్చ ఆగిపోయే వరకు వైసీపికి, జగన్‌కి నష్టం జరుగుతూనే ఉంటుంది. కనుక అంతవరకు భరించాల్సిందే.